వరలక్ష్మి అంటే ఎవరు ?వరలక్ష్మి వ్రతప్రభావం ఏమిటి ?

Submitted by devaprasna on Sun, 01/13/2019 - 05:58

వరలక్ష్మి అంటే ఎవరు ?వరలక్ష్మి వ్రతప్రభావం ఏమిటి ? మనం వరలక్ష్మి వ్రతం చేస్తున్న పద్దతి సరైనదేనా ? వరలక్ష్మి వ్రతం ఎలా చెయ్యాలి? వరలక్ష్మి వ్రతానకి జ్యోతిషానికి-పరిహార భాగానికి ఉన్న సంభందం ఏమిటి?
వరలక్ష్మీ వ్రతం విశిష్టత - దేవప్రశ్న విధానంలో పరిశీలన ::

వరలక్ష్మీ వ్రతం ఎప్పుడూ జూలై - ఆగష్టు నెలల్లో (సూర్యుడు కర్కాటకం- సింహం రాసులలో సంచారం చేస్తున్నప్పుడు) వస్తుంది. ఎందుకు? మిగిలిన నెలల్లో చేయకూడదా? లక్ష్మీ పూజ రోజు చేస్తాము కదా. ఈ పూజ ప్రత్యేకత ఏమిటి? లక్ష్మీదేవిని దేవి నవరాత్రులలో కూడా పూజ చేస్తాము. అప్పుడు మహాలక్ష్మి అనీ ఇప్పుడు వరలక్ష్మి అనీ ఎందుకు అంటాము. ఎందుకు? ఒక పరిశీలన.

మనము చేసే పూజలు వ్రతాలూ అన్నీ కొన్ని ప్రత్యేక సమయాలలోనే చెబుతారు. వీటిలో ఆధ్యాత్మిక- వైజ్ఞ్యానిక-జ్యోతిష కోణాలు ఉంటాయి. ఇప్పుడు జ్యోతిష కోణంలో చూద్దాం.
కర్కాటక రాశి: అధిపతి చంద్రుడు. పునుర్వసు-4వ పదం పుష్యమి -1,2,3,4 పాదాలు ఆశ్లేష 1,2,3,4 పాదాలు ఈ రాశిలో ఉంటాయి. వీటి నవాంశలు కర్కాటకములో ప్రారంభం అయి మీనంలో పూర్తి అవుతాయి. పునుర్వసు నక్షత్ర నవాంశ మేష రాశిలో ప్రారంభం అయి కర్కాటకంలో పూర్తి అవుతుంది. జీవ కారకుడు అయిన గురునికి కర్కాటక రాసి ఉచ్చరాశి. క్షీరసాగర మధనం సమయంలో అమృతరూపుడు-లక్ష్మీ సోదరుడు అయిన చంద్రుడు పుట్టాడు. పూర్ణిమ చంద్రుడు అమృత స్వరూపుడు. మృత్యుంజయుడు అయిన ఈశ్వరుడు చంద్రుని ధరించి వుంటాడు. ఈ చంద్రునికి వెలుగుని ఇచ్చేది సూర్య భగవానుడు. సూర్యునికి ఎదురుగా సుమారు 180 డిగ్రీలు దూరంగా చద్రుడు ఉన్నప్పుడు పూర్ణిమ వస్తుంది. అంటే చంద్రుడు మకర రాశిలో వున్నప్పుడు.
ఎందుకంటే శ్రావణ పౌర్ణమికి శ్రవణం నక్షత్రంలో చంద్రుడు ఉంటాడు. ఈ శ్రవణం నక్షత్రం కలియుగదైవం శ్రీ వెంకటేశ్వరస్వామి వారిది. ఇది మకర రాశిలో ఉంటుంది

మొత్తం రాశులు12. నవాంశాలు 108. లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రంలో నామాలు మొత్తం 108.

లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రంలో 90 వ నామం వరలక్ష్మైనమః. 90వ నవాంశ కన్యారాశిలోకి వస్తుంది.
కన్య రాశికి అధిపతి బుధుడు. అధిదేవత విష్ణువు.
ఇప్పుడు మంత్రశాస్త్ర కోణంలో చూద్దాం.
వరలక్ష్మి వ్రతకల్పంలో చారుమతికి కలలో లక్ష్మిదేవి కనబడి నేను వరలక్ష్మిని వచ్చే శ్రావణ పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారమునాడు నన్ను పూజించమని చెప్పిందని చారుమతి వరలక్ష్మీవ్రతం చేసి 9 ప్రదిక్షణాలు చేయగానే ఒక్కక్క ప్రదిక్షణానికి అంతులేని ధనం వాహనాలు బంగారం వచ్చిందని చదువుకుంటూ వున్నాము (మన తాత ముత్తాతల కాలం నుంచి). కాని అలా ఎక్కడా జరగడంలేదు. ఎందుకు? వ్రతకథలొ తప్పు ఉందా? మనము చేసే విధానము తప్పా?
మరింత వివరంగా చూద్దాం .

ఆషాడ శుక్ల ఏకాదశినుంచి శ్రీమహావిష్ణువు యోగనిద్రలో ఉంటాడుకదా. లక్ష్మీదేవిని నిత్యానపాయని అంటాంకదా. అనగా లక్ష్మీదేవి ఎప్పుడూ శ్రీమహవిష్ణువుతోనే వుంటుంది కదా! అలాంటప్పుడు యోగనిద్రలో ఉన్న విష్ణువు వదిలిపెట్టి లక్ష్మిని పూజ చేయడము సరిఅయిన పద్ధతేనా?
ఇప్పుడు వరలక్ష్మి, శ్రీమహావిష్ణువు భార్య అయిన లక్ష్మి ఒక్కరేనా చూద్దాం. చండి సప్తశతి లో మార్కండేయ మహాముని లక్ష్మిని అద్యాదిలక్ష్మి అని వివరణ ఇచ్చాడు. అంటే ఆదికి ఆది అంటే ప్రకృతి శక్తి, స్థితి కారిణి అయిన లక్ష్మి. ఈమె సింహవాహిని. మనకు లభిస్తున్న లక్ష్మీ హృదయంలో (అద్యాది లక్ష్మీ హృదయం ) ఒక మంత్రం ఉంటుంది.

మంత్రం : ఓం శ్రీం హ్రీం ఐం శ్రీలక్ష్మీ కమలధారిణ్యై సింహవాహన్యై స్వాహా
విష్ణుపత్ని లక్ష్మీ దేవి వాహనం సింహం కాదు కదా. మరి ఈ లక్ష్మి ఎవరు. లక్ష్మీహృదయంలో లక్ష్మీ స్తుతిలో ఈ విధంగా ఉంటుంది. సత్యలోకంలో ఉండే లక్ష్మి, శ్వేత ద్వీపంలో ఉండే లక్ష్మి, క్షీరాంబుధి (పాల సముద్రం లో ) ఉండే లక్ష్మి, రత్నగర్భస్థిత లక్ష్మి , రసాతలస్థిత లక్ష్మి ఇంకా చాల రూపాల్లో ఉండే లక్ష్మి మా ఇంట్లో స్థిరంగా ఉండమని ప్రార్ధన ఉంటుంది. మరి వీళ్ళందరూ ఎవరు?

విష్ణుమూర్తి ప్రమేయం లేకుండా విడిగా ఉండే లక్ష్మిని వీరలక్ష్మి (ఆగమ శాస్త్ర పరంగా ) అంటారు. ఆవిడే ఈ వరలక్ష్మి.
ఇప్పుడు వరలక్ష్మికి జ్యోతిషశాస్త్రంలో పరిహార భాగానికి సంభందం చూద్దాం.

చారుమతి ఒక బ్రాహ్మణస్త్రీ. ఆమె రోజు భర్తకు, అత్తామామలకు సేవలు చేస్తూ పతివ్రతా ధర్మాలు పాటిస్తూ ఉంది. ఆమెకు వరలక్ష్మి కలలో కనిపించి వ్రతవిధానం చెప్పింది.

స్త్రీలకు పతిసేవకు మించిన ధర్మం లేదు
ఈమె తన ధర్మం పాటించడంవల్ల పూర్వ జన్మల కర్మ నశించి భగవదనుగ్రహం కలిగి వరలక్ష్మి కలలో దర్శనం ఇచ్చింది
లక్ష్మీసహస్రనామస్తోత్రంలో ఒక నామం ఉంది." గృహచ్చిద్ర నివారిణియైనమః "
అంటే ఇల్లు చ్చిద్రం (పాడవడం) కాకుండా చేసేది అని అర్ధం. సాధారణంగా మానవులకు వచ్చే అన్ని సమస్యలకు మూలం డబ్బు
"ధనం మూలం ఇదం జగత్" ప్రపంచం అంతా ధనం మీద ఆధారపడి ఉంది. దానం ధర్మం చెయ్యాలి అంటే డబ్బు కావాలి. ధార్మిక కార్యాలు చెయ్యాలంటే డబ్బు కావాలి. అలాంటి ధనాన్ని ఇచ్చేదే మహాలక్ష్మి ఆమె ఆద్యాది లక్ష్మి (వరలక్ష్మి).


జాతకంలో చెడ్డ దశలు ఉన్న సమయంలో ఆర్ధిక మానసిక ఇబ్బందులు కలుగుతాయి. మనం చేసే మంత్రం జపాలు పూజల వల్ల కర్మ తొలిగి మంచి జరుగుతుంది. చారుమతికి మంచి సమయం రావడంవల్ల వరలక్ష్మి అనుగ్రహం కలిగి కలలో దర్సనం ఇచ్చింది
వరలక్ష్మి అనే నామం 90వ నామము. కన్యానవాంశ లో వస్తుంది. దీని ముందు రాశి సింహరాశి. ఇప్పుడు వరలక్ష్మి సింహవాహిని అయిన కన్య (ఆద్యాదిలక్ష్మి). లక్ష్మితో కూడిన విష్ణువుకు శక్తిని ఇచ్చేది.
వరలక్ష్మి నామ వివరణ :
90వ నామం : వరలక్ష్మైనమః "వ్రియతి ఇతి వరః" అనగా వరించబడుతున్నది. "వ్రియతే జనిరితి వరం " జనులచేత ఆశ్రయించబడుతున్నది. శ్రీ మహాలక్ష్మి జనులచేత వరింపబడుతున్నది. వర అనే శబ్దానికి ఉత్తమమైనది అని అర్ధం. అందరికి వరాలని ఇచ్చి కోర్కెలు తీర్చే తల్లి
వరలక్ష్మి సింహ వాహిని అనుకున్నాం కదా. కన్యారాశి ఈమె నివాస స్థానం ఐతే ముందు ఉండే రాశి సింహం ఈమె వాహనం. ఇంకొక రకంగా చూద్దాం. ఆద్యాది లక్ష్మి రూపం వరలక్ష్మి అని ఈమె యొక్క రూపమే మహాలక్ష్మి అని అంటున్నాం. మరి ఇప్పుడు లక్ష్మికి సింహవాహనం లేదుకదా!
లక్ష్మి విష్ణు వక్షస్థల నివాసిని అంటున్నాం. నరసింహస్వామి సింహరూపుడు అయిన శ్రీమహావిష్ణువు. ఇప్పుడు కూడా లక్ష్మి సింహవాహిని అయ్యింది కదా.

ఇప్పుడు వరలక్ష్మి వ్రతాన్ని ఎలా చెయ్యాలో చూద్దాం.
సూర్యుడు కర్కాటక రాశి ప్రవేశం చేసిన తరువాత ఒక మంచి రోజు చూసుకొని వీలు ఐతే గురు పౌర్ణమి నాడు మొదలుపెట్టి పైన చెప్పిన మంత్రాన్ని వరలక్ష్మి వ్రతం వచ్చే రోజు వరుకు జపం చెయ్యాలి. వరలక్ష్మి వ్రతం చేసిన తరువాత ఆరోజు రాత్రి నిద్రపోకుండా లక్ష్మి హృదయం పారాయణ చెయ్యాలి. వరలక్ష్మి వ్రతాన్ని సి .డి. పెట్టుకుని కాకుండా మంచి బ్రాహ్మణుడని పిలుచుకుని గణపతి పూజ పుణ్యాహవాచనం చేసుకుని పీఠ పూజ చేసి కలశ స్థాపన చేసుకోవాలి. వరలక్ష్మి స్త్రీ దేవత కనుక దిక్పాలకుల స్థానాల్లో అష్టమాతృకలని ఆవాహన చేసి
శ్రీసూక్త విధానముగా పూజ చేసి లక్ష్మి సహస్ర నామాలతో అర్చన చెయ్యాలి. వీలు అయితే ఇంట్లో చేసిన పాలకోవా లేదా కలకండ నివేదన చెయ్యాలి. పూజకు క్రొత్త చీర కట్టుకుని చేసికోవడము అలవాటు. కానీ క్రొత్త బట్టలు షాపుల్లో అందరు ముట్టుకున్నవి, అందువల్ల తడిపి ఆరవేసిన బట్టలు కట్టుకొని పూజ చేసి, పూజ అయిన తర్వాత క్రొత్త బట్టలు కట్టుకోవాలి. ముఖ్యంగా గమనించవలిసినది పూజకు వచ్చే బ్రాహ్మణునికి కాళ్ళు కడుగుకోవడానికి మీ బాత్రూంలోకి పంపకండి. బాల్కనిలోనో వేరొక చోటో కాళ్ళు కడుకోమ్మనండి. వీలు ఐతే ఫై మంత్రాన్ని పౌర్ణమి నాడు హోమం చేసుకోవాలి. మంత్రం జపం రోజూ చేసుకోవాలి. ఇలా చేయడం మూలంగా చారుమతికి జరిగినట్టు కాకపోయినా మనకి కూడా ఐశ్వర్యం పడుతుంది .

జ్యోతిష శాస్త్రం ప్రకారం సంపదలని ఇచే గ్రహాలు గురుడు, శుక్రుడు, బుధుడు. ఈ గ్రహాల సంచారం వరలక్ష్మీవ్రతం రోజు ( 28-08-2015) ఇలా ఉంది. ఆరోజు కన్యలో బుధుడు ఉత్తర నక్షత్రం 3వ పాదంలో, సింహరాశిలో సూర్యుడు మఖ-4వ పాదంలో, గురుడు మఖ-3వ పాదంలో, శుక్రుడు ఆశ్లేష-2వ పాదంలో, చంద్రుడు శ్రవణా నక్షత్రంలో ఉన్నారు. సింహవాహిని అయిన వరలక్ష్మి దేవగురువు అయిన గురుడు సింహరాశిలో సంచారం చేసే ఈ సమయంలో వరలక్ష్మి వ్రతము చేసి అందరూ వరలక్ష్మి అనుగ్రహం వల్ల సకల శుభాలు పొందండి.

Add new comment

Restricted HTML

  • Allowed HTML tags: <a href hreflang> <em> <strong> <cite> <blockquote cite> <code> <ul type> <ol start type> <li> <dl> <dt> <dd> <h2 id> <h3 id> <h4 id> <h5 id> <h6 id>
  • Lines and paragraphs break automatically.
  • Web page addresses and email addresses turn into links automatically.